తాతయ్యలంతా ఇంతేనా..??

చాలా రోజుల క్రితం సంగతి ఇది.
రెండుకిలోమీటర్ల దూరం నడవడానికి బద్దకమేసి ఎవరైనా లిఫ్ట్ ఇస్తారేమో అని రోడ్డుపక్కన నిలబడ్డాను.
ఎండ అస్సలు లేదు.మేఘాలు మాత్రం చాలా వేగంగా కదులుతున్నాయ్.ఒక పెద్దాయన బైక్ మీద వస్తున్నారు.
నెరసిన జుట్టు,పంచకట్టు,పెద్దమీసం..

లిఫ్ట్ అన్నట్లు చేయి చూపించాను.


బైక్ వెళ్తుంది..చెమట,మట్టి కలిసిన ఒక వాసన వెనక సీట్లో కూర్చున్న నన్ను పలకరించాయి.
చనిపోయిన నా తాతనిగుర్తుచేశాయి. నా తాతయ్య రైతు.పొద్దున పంచకట్టుతో వెళ్ళి సాయంకాలం మట్టివాసనతో వచ్చేరైతు.వట్టిచేతులతో
వచ్చే తాతయ్యని నేనేప్పుడూ చూడలేదు.కొబ్బరుండలో,చెకోడీలో ఏదోటి మూటగట్టి నా కోసం తేవాల్సిందే.
తాతయ్య ఇంటినుండి,పొలం ఒక కిలోమీటరు  దూరం ఉంటుంది.నన్ను మెడమీద ఎక్కించుకుని చేలగట్ల మీద నడుస్తూ వెళ్లేవాడు.మద్యలో హనుమంతురావు గారి మోటరు దగ్గర ఉసిరికాయల చెట్టు దగ్గర ఒకసారి ఆగి ఓ నాలుగు కాయలు కోసి నా రెండంగుళాల పై జేబులో పెట్టేవాడు.తాతయ్య నా మీద చాలా తక్కువగా కోప్పడేవాడు.
అదికూడా ఎప్పుడో తెలుసా,ముంజికాయని చూపుడువేలుతో పొడిచినపుడో,
వడ్లబస్తాలపై మట్టికాళ్లతో ఎక్కినప్పుడో అంతే.
తాతయ్య నన్ను ఎప్పుడు ఎత్తుకున్నా మట్టివాసన నాకు తెగ నచ్చేది.

ఇతని దగ్గర కూడా అదే మట్టివాసన,నా తాతయ్యని గుర్తుచేసే ఆ మట్టివాసన.
బైక్ దిగాను.ఏం మాట్లాడాలో తెలీని నిశబ్దం.నా తాతయ్యని మళ్ళీ చూశానా అనిపించే ఆశ్చర్యం.నేనేదో చెప్పేలోపే
బైక్ మొందుకి వెళ్ళిపోయింది.

తాతయ్యలంతా ఇంతేనేమో,బోలెడంత ప్రేమను పంచి తిరిగి ఇచ్చేలోపు వెళ్ళిపోతారు.
నాలాంటి మనవడికి తాతయ్య మట్టివాసనను మించిన గురుతు ఇంకోటి ఉండదు.