కుమార్.....

నా చిన్నప్పుడు అంటే రెండో తరగతి చదివే వయసులో,మేము కొవ్వూరు (పశ్చిమగోదావరి ) లో ఉండేవాళ్ళం.వాటర్ టాంక్ దగ్గర మెరక వీధి చివరకి వెళ్ళిపోతే మేము ఉండే వీధి వస్తుంది.పక్కనే గోదారి గట్టు(కొవ్వూరు నుండి తాళ్ళపూడి వెళ్ళే గట్టు రోడ్).అది దాటితే గోదారి..గాలి..ఇసుక..నా బాల్యం లో మొదటి దశ ఇక్కడే గడిచింది.ఆ గట్టు పక్కనే ఉన్న నాలుగు గదుల ప్రాధమిక పాఠశాలలో నా చదువు ప్రారంభమయింది.ఆడుకునే ప్రదేశంలో వేపచెట్టు,అటు పక్కనే చింతచెట్టు ఉండేవి.ఎలా పరిచయమయ్యాడో గుర్తులేదు.కానీ నా జీవితం లో మొదటి స్నేహితుడు వాడే.కుమార్..ఒకే తరగతి,ఒకే బడి,ఒకే చింతకాయ్..లక్ష్మి టీచర్ గారి(ఈవిడ కూడా నా మొదటి టీచర్) ఇంటి పక్కనే వీడి ఇల్లు.ఎప్పుడూ మంచినీళ్ళు తాగాలన్నా కుమార్ వా్ళ్ళ ఇంటికే వెళ్ళేవాళ్ళం.మా ఇంటి పక్కనే ఉండేది..రమ్య.రెండో ఫ్రెండ్.ఇక మేము ముగ్గురమే..బడికి వెళ్ళడం,రావడం,ఆడడం,ఆదివారం మోగ్లీ చూడడం..ఇంకా బోలెడు.మా చిన్నాన్న మొక్కలు పెంచుతూ ఉండేవాడు.అందులో గులాబీ మొక్క కూడా ఉండేది,పువ్వు మాత్రం రమ్య పొట్టి జడలోనే పూసేది.కొన్ని రోజులకి,అంటే నా రెండో తరగతి మద్యలో మేము ధర్మవరం (పశ్చిమగోదావరి) వెళ్ళిపోయాం.పూర్తిగా.

ఆ తరువాత దర్మవరం బడిలో..బడి్ గంట కొట్టిన ప్రతీసారీ కుమార్ గాడు.,గులాభి పువ్వు పూసిన ప్రతీసారి రమ్య గుర్తొచ్చేవారు.వెళ్ళి వాళ్ళని కలిసే వయసు అప్పుడు లేదు.అలా పదోతరగతి దాటేశా.ఇంటర్ కదా..రెక్కలొచ్చేశాయ్..ఒకసారి కుమార్ ని కలుద్దాం అని కొవ్వూరు వెళ్ళాను.మా నాలుగు గదుల బడి మూడుగదులదయిపోయింది.కుమార్ వాళ్ళ ఇంటకి వెళ్తే వేరెవరో ఉన్నారు.రమ్య ని అడిగితే "కమార్ ఎవరు?" అంది.రమ్య మూడో తరగతిలో్ వాళ్ళ అమ్మమ్మ ఊరికి వెళ్ళిపోయిందట.So,కుమార్ ని మర్చిపోయింది.పువ్వు ఇచ్చానని అనుకుంట ,నన్ను గుర్తుపెట్టుకుంది.కాసెపు మాట్లాడిన తర్వాత "హా గుర్తొచ్చాడు..వాళ్ళు ఇల్లు మారిపోయారు కదా.గట్టు పక్కన ఇంటిలోకి వెళ్ళిపోయారు అని చెప్పింది.

రమ్య చెప్పిన ఇంటి దగ్గరికి వెళ్తే,అది పై కప్పు కూలిపోయి ఉంది.ఆ వీధిలొ అప్పారావు తాతయ్య తెలుసు నాకు.వెళ్ళి అడిగా.."తాతా..ఆ ఇంటిలో వాళ్ళు ఇప్పుడు ఎక్కడుంటున్నారు" అనిగట్టు మీదినుండి వెళ్తున్న లారీ పడి ఆ ఇంటిలో ఇద్దరు చనిపోయారు.తర్వాత మిగిలిన వాళ్ళు ఎక్కడీకెళ్ళారో తెలీదు అని చెప్పాడు.కళ్ళవెంట నీళ్ళతొ అడిగా,నా వయసు వాళ్ళు ఎవరైనా చనిపోయారా అని ..లేదు,ఒక ముసలావిడ,ఒక మగతను అని చెప్పాడు..

పోని వాడి గురించి తెలుసుకుందాం అంటే కుమార్ అనే పేరు తప్ప వాడి గురించి ఇంకేమీ తెలీదు.అప్పటి వయసుకి వాడి పేరు తప్ప ఇంకేమీ అవసరం లేదుగా మా స్నేహానికి.వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా ఎప్పుడూ చూసిన గుర్తు లేదు.వాడి చిన్నప్పటి మొహం మాత్రం ఇప్పటికీ గుర్తుంది.సన్నగా,పలచని జుట్టుతో ఉంటాడు.వెదవ.

ఇప్పటికీ అప్పుడప్పుడూ  కుమార్ గాడు గుర్తొస్తూ ఉంటాడు..మొదటి స్నేహితుడి జ్ఞాపకాలు అ,ఆ,ఇ,ఈ లు మరి.ఎప్పటికి మర్చిపోలేను..

రేయ్,కుమార్ మి ఇంటికొచ్చి మంచినీళ్ళు తాగలనుందిరా.