1


"During pregnancy if the mother suffers organ damage, the baby in the womb sends stem cells to repair the damaged organ."

చలం

చలం  చనిపోలేదు.
చినుకు చూస్తే కనిపిస్తాడు.
చిగురు చూస్తే కనిపిస్తాడు.
పొడుగు జడ,పసిపిల్ల నవ్వు,మల్లెపువ్వు,చెరువు రేవు,
గడ్డిపోచ..దాని మీదున్న తెల్లారి మంచు చూసిన ప్రతిసారి కనిపిస్తాడు.
మైదానం లో పరుగెట్టి,పడుకుని,దొర్లిన నాలాంటి వాళ్ళందరికీ చలం ఎప్పటికీ కనిపిస్తాడు.

చలం

అడవిలో పాములూ పులులూ ఉన్నాయి - జాగ్రత్త అనటం న్యాయం.
జాగ్రత్తపడిపో..ప్రాణాలమీద అంత తీపి లేకపోయినా వెళ్ళు అనటం న్యాయం..
కానీ నీ హృదయంలో దౌర్జన్యంలేకపోతే పులిని బ్రహ్మస్వరూపంగా చూసుకుంటూ వెళ్ళు..
నీకేం భయంలేదు.. అని ప్రతివారినీ ఉద్భోదించటం మూర్ఖం. పులులు లేవు ఏమీలేవు
చాలా హాయిగా ఉంది అడవుల్లో అనటం  మోసం. !! 

ప్రతిసంగతినీ వాస్తవ దృష్టితో చూసి....తెలుసుకొని మసలుకుంటే సగం  చికిత్స జరిగిందన్నమాటే!

కవితలు

ప్రేమలోనో,పెళ్ళిలోనో విఫలమైనవాళ్ళు తమ అసహనాన్ని మొత్తం స్త్రీ జాతికో,మగజాతికో ఆపాదించి
కష్టపడి నేర్చుకున్న కఠిన పదజాలం వాడేసి,కవితలు రాసేసి అదేదో సమాజాన్ని ఉద్ధరించే పని 
అనుకోవడం అవివేకం.

వసంతం కోసం ఎదురుచూసే కోకిలకి ధైర్యం ఇచ్చే కవిత రాయ్..
చావాలనుకున్న శిశిరానికి చిగురులున్నాయ్ అని చెప్పే కవిత  రాయ్.

పదాలు పదికాలలపాటు ఉంటాయ్
నీతో అ,ఆ లు దిద్దించిన గురువు ఆనందపడతాడు.

చలం






ఎంత నలపనీ..చీల్చనీ.. అపదల మీద ఆపదలు దొర్లించనీ..
కష్టాలమీద  కష్టాలు కలిగించనీ, ఉండుండీ కొన్ని దివ్యానుభవాలని ఎప్పుడో ఒకప్పుడు ప్రసాదిస్తుంది కనకనే.. ఆ ఆశే..ఆ కలలే, ఆ విశ్వాసమే జీవితాన్ని దుర్బరం కానీయకుండా నిలుపుతోంది.
                                            - చలం.

మల్లి

                                                       






మంచు కురిసేవేళలో విరిసిన మల్లి కంటే
వేడి సాయంకాలాల్లో మురిసే మల్లి హాయి.
                              -ఓ వేసవి అనుభవం

ఆకర్షణకి వికర్షణ

ఆకర్షణకి వికర్షణ ఉండటం తప్పనిసరి.
ఒక పని చేస్తూ మరో పనిలోకి మారి మళ్ళీ మొదటిపనిని
చేపట్టిన ప్రతిసారీ మీ సామర్ధ్యం మెరుగవుతుంది.

ఒకేరీతిగా సాగే ఏ పనికైనా విరామం తప్పనిసరి.
మార్పు ఏ రూపం లో ఉన్నా అది మీ మనసుమీద ఒత్తిడిని తగ్గిస్తుంది.
అలా ఒత్తిడి తగ్గినపుడు మనసు మరింత బాగా అలోచిస్తుంది.

అందుకే ప్రకృతి ఒడిలో ఉన్నప్పుడు మనుషులెప్పుడూ చక్కగా అలోచించగలుగుతారు.


                                                                           _పోస్టు  చెయ్యని ఉత్తరం నుండి..



తాతయ్యలంతా ఇంతేనా..??

చాలా రోజుల క్రితం సంగతి ఇది.
రెండుకిలోమీటర్ల దూరం నడవడానికి బద్దకమేసి ఎవరైనా లిఫ్ట్ ఇస్తారేమో అని రోడ్డుపక్కన నిలబడ్డాను.
ఎండ అస్సలు లేదు.మేఘాలు మాత్రం చాలా వేగంగా కదులుతున్నాయ్.ఒక పెద్దాయన బైక్ మీద వస్తున్నారు.
నెరసిన జుట్టు,పంచకట్టు,పెద్దమీసం..

లిఫ్ట్ అన్నట్లు చేయి చూపించాను.


బైక్ వెళ్తుంది..చెమట,మట్టి కలిసిన ఒక వాసన వెనక సీట్లో కూర్చున్న నన్ను పలకరించాయి.
చనిపోయిన నా తాతనిగుర్తుచేశాయి. నా తాతయ్య రైతు.పొద్దున పంచకట్టుతో వెళ్ళి సాయంకాలం మట్టివాసనతో వచ్చేరైతు.వట్టిచేతులతో
వచ్చే తాతయ్యని నేనేప్పుడూ చూడలేదు.కొబ్బరుండలో,చెకోడీలో ఏదోటి మూటగట్టి నా కోసం తేవాల్సిందే.
తాతయ్య ఇంటినుండి,పొలం ఒక కిలోమీటరు  దూరం ఉంటుంది.నన్ను మెడమీద ఎక్కించుకుని చేలగట్ల మీద నడుస్తూ వెళ్లేవాడు.మద్యలో హనుమంతురావు గారి మోటరు దగ్గర ఉసిరికాయల చెట్టు దగ్గర ఒకసారి ఆగి ఓ నాలుగు కాయలు కోసి నా రెండంగుళాల పై జేబులో పెట్టేవాడు.తాతయ్య నా మీద చాలా తక్కువగా కోప్పడేవాడు.
అదికూడా ఎప్పుడో తెలుసా,ముంజికాయని చూపుడువేలుతో పొడిచినపుడో,
వడ్లబస్తాలపై మట్టికాళ్లతో ఎక్కినప్పుడో అంతే.
తాతయ్య నన్ను ఎప్పుడు ఎత్తుకున్నా మట్టివాసన నాకు తెగ నచ్చేది.

ఇతని దగ్గర కూడా అదే మట్టివాసన,నా తాతయ్యని గుర్తుచేసే ఆ మట్టివాసన.
బైక్ దిగాను.ఏం మాట్లాడాలో తెలీని నిశబ్దం.నా తాతయ్యని మళ్ళీ చూశానా అనిపించే ఆశ్చర్యం.నేనేదో చెప్పేలోపే
బైక్ మొందుకి వెళ్ళిపోయింది.

తాతయ్యలంతా ఇంతేనేమో,బోలెడంత ప్రేమను పంచి తిరిగి ఇచ్చేలోపు వెళ్ళిపోతారు.
నాలాంటి మనవడికి తాతయ్య మట్టివాసనను మించిన గురుతు ఇంకోటి ఉండదు.

కుమార్.....

నా చిన్నప్పుడు అంటే రెండో తరగతి చదివే వయసులో,మేము కొవ్వూరు (పశ్చిమగోదావరి ) లో ఉండేవాళ్ళం.వాటర్ టాంక్ దగ్గర మెరక వీధి చివరకి వెళ్ళిపోతే మేము ఉండే వీధి వస్తుంది.పక్కనే గోదారి గట్టు(కొవ్వూరు నుండి తాళ్ళపూడి వెళ్ళే గట్టు రోడ్).అది దాటితే గోదారి..గాలి..ఇసుక..నా బాల్యం లో మొదటి దశ ఇక్కడే గడిచింది.ఆ గట్టు పక్కనే ఉన్న నాలుగు గదుల ప్రాధమిక పాఠశాలలో నా చదువు ప్రారంభమయింది.ఆడుకునే ప్రదేశంలో వేపచెట్టు,అటు పక్కనే చింతచెట్టు ఉండేవి.ఎలా పరిచయమయ్యాడో గుర్తులేదు.కానీ నా జీవితం లో మొదటి స్నేహితుడు వాడే.కుమార్..ఒకే తరగతి,ఒకే బడి,ఒకే చింతకాయ్..లక్ష్మి టీచర్ గారి(ఈవిడ కూడా నా మొదటి టీచర్) ఇంటి పక్కనే వీడి ఇల్లు.ఎప్పుడూ మంచినీళ్ళు తాగాలన్నా కుమార్ వా్ళ్ళ ఇంటికే వెళ్ళేవాళ్ళం.మా ఇంటి పక్కనే ఉండేది..రమ్య.రెండో ఫ్రెండ్.ఇక మేము ముగ్గురమే..బడికి వెళ్ళడం,రావడం,ఆడడం,ఆదివారం మోగ్లీ చూడడం..ఇంకా బోలెడు.మా చిన్నాన్న మొక్కలు పెంచుతూ ఉండేవాడు.అందులో గులాబీ మొక్క కూడా ఉండేది,పువ్వు మాత్రం రమ్య పొట్టి జడలోనే పూసేది.కొన్ని రోజులకి,అంటే నా రెండో తరగతి మద్యలో మేము ధర్మవరం (పశ్చిమగోదావరి) వెళ్ళిపోయాం.పూర్తిగా.

ఆ తరువాత దర్మవరం బడిలో..బడి్ గంట కొట్టిన ప్రతీసారీ కుమార్ గాడు.,గులాభి పువ్వు పూసిన ప్రతీసారి రమ్య గుర్తొచ్చేవారు.వెళ్ళి వాళ్ళని కలిసే వయసు అప్పుడు లేదు.అలా పదోతరగతి దాటేశా.ఇంటర్ కదా..రెక్కలొచ్చేశాయ్..ఒకసారి కుమార్ ని కలుద్దాం అని కొవ్వూరు వెళ్ళాను.మా నాలుగు గదుల బడి మూడుగదులదయిపోయింది.కుమార్ వాళ్ళ ఇంటకి వెళ్తే వేరెవరో ఉన్నారు.రమ్య ని అడిగితే "కమార్ ఎవరు?" అంది.రమ్య మూడో తరగతిలో్ వాళ్ళ అమ్మమ్మ ఊరికి వెళ్ళిపోయిందట.So,కుమార్ ని మర్చిపోయింది.పువ్వు ఇచ్చానని అనుకుంట ,నన్ను గుర్తుపెట్టుకుంది.కాసెపు మాట్లాడిన తర్వాత "హా గుర్తొచ్చాడు..వాళ్ళు ఇల్లు మారిపోయారు కదా.గట్టు పక్కన ఇంటిలోకి వెళ్ళిపోయారు అని చెప్పింది.

రమ్య చెప్పిన ఇంటి దగ్గరికి వెళ్తే,అది పై కప్పు కూలిపోయి ఉంది.ఆ వీధిలొ అప్పారావు తాతయ్య తెలుసు నాకు.వెళ్ళి అడిగా.."తాతా..ఆ ఇంటిలో వాళ్ళు ఇప్పుడు ఎక్కడుంటున్నారు" అనిగట్టు మీదినుండి వెళ్తున్న లారీ పడి ఆ ఇంటిలో ఇద్దరు చనిపోయారు.తర్వాత మిగిలిన వాళ్ళు ఎక్కడీకెళ్ళారో తెలీదు అని చెప్పాడు.కళ్ళవెంట నీళ్ళతొ అడిగా,నా వయసు వాళ్ళు ఎవరైనా చనిపోయారా అని ..లేదు,ఒక ముసలావిడ,ఒక మగతను అని చెప్పాడు..

పోని వాడి గురించి తెలుసుకుందాం అంటే కుమార్ అనే పేరు తప్ప వాడి గురించి ఇంకేమీ తెలీదు.అప్పటి వయసుకి వాడి పేరు తప్ప ఇంకేమీ అవసరం లేదుగా మా స్నేహానికి.వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా ఎప్పుడూ చూసిన గుర్తు లేదు.వాడి చిన్నప్పటి మొహం మాత్రం ఇప్పటికీ గుర్తుంది.సన్నగా,పలచని జుట్టుతో ఉంటాడు.వెదవ.

ఇప్పటికీ అప్పుడప్పుడూ  కుమార్ గాడు గుర్తొస్తూ ఉంటాడు..మొదటి స్నేహితుడి జ్ఞాపకాలు అ,ఆ,ఇ,ఈ లు మరి.ఎప్పటికి మర్చిపోలేను..

రేయ్,కుమార్ మి ఇంటికొచ్చి మంచినీళ్ళు తాగలనుందిరా.