నడవడం నాకు కొత్త కాదు..
కాని ఆగిపోయిన అడుగు ముందుకి కదలడం లేదు..
నిజం చెప్పాలంటే కదలాలని లేదు.
రెండు చిన్ని చేతులు కటిక గోడకి ,
రంగులద్దుతున్నాయి..
తన చేతులలో బోలెడు రంగులు..
చూసే ప్రతి ఒక్కరు పెద్ద గోడనే చూస్తున్నారు..
చిన్ని చేతుల బుజ్జి రంగులు ఎవ్వరికి కనిపించట్లేదా ?
తను ఏమిచేస్తుందో
అర్ధం కాక నడవలేని పాదాన్ని,
చూపులకి అరువిచ్చాను
కళ్ళు నిలబడి పోయాయి.
తన దగ్గరకి వెళ్లి
ఆ రంగులని తాకాలని నా చేతులని రంగులమయం చేయాలనీ ప్రయత్నించా..కానీ ఆ రంగులేవీ నేను తకలేక పోయాను..
ఎక్కడినుండి ఈ రంగులు తెస్తుందా అని చూసాను..
ఏమి లేవ్..
ఈ రంగులు ఎక్కడివి అని అడిగా ..
కాసేపు చేతుల వంక చూసుకుని బుజ్జి నవ్వు నవ్వింది.
మళ్ళి తన పనిలో మునిగిపోయింది.
రంగుల్లో ముద్దయిపోతున్న ఆ గోడని అలాగే చూడాలనిపించింది.
ఆ రంగులు నా జీవితానికి అద్దాలి అనిపించింది.
గోడ రూపం మారిపోయింది.
కాసేపటికి ఆ కటిక గోడ నాకు కనిపించలేదు.
ఆ చిన్ని చేతులు ఆ గోడకి జీవం పోసేసాయి.
అ రంగులు ఎక్కడివో కాదు
ఆమె ఆలోచనలే రకరకాల రంగులయిపోయాయి.
ప్రాణం పోశాయి.
అప్పటివరకు నాలో లేని రంగులు
నా వేళ్ళ పై కనిపించే.
కటిక గుండె గోడపై.. జీవపు రంగులు పులిమాయి.
ఆమె చిరునవ్వు లో జీవితపు రంగు చూసాను..
ఈ అమ్మాయ్ రంగులు అద్దింది ,గోడకి కాదు నా జీవితానికి.
అవకాశం ఇస్తే హరివిల్లు కి కుడా రంగులు వెయ్యగలదు అనిపించింది.
చిన్ని చేతులతో గోడపై మధుమతి అని సంతకం చేసి వెళ్ళిపోతుంది..
ఎక్కడికి అని అడిగాను.
వెనక్కి తిరిగి మళ్లీ నవ్వుల రంగు విసిరింది.
ఎక్కడికి అని గట్టిగ కటిక గోడల అరిచాను.
వెళ్తూ ...వెళ్తూ...
హరివిల్లు కి రంగులు వేయడానికి అని చెప్పింది..
కటిక గోడ నవ్వింది..
నాకు జీవితపు రంగు దొరికింది.
పాదం ఇప్పుడు ఎప్పటికి ఆగదు..
నాది..తనది...గోడది..